డబ్బు గురించి ఆలోచించడం ఎలా ?

డబ్బు గురించి చెప్పుకునేముందు, అసలు డబ్బు గురించి ఎలా ఆలోచించాలి అనే అవగాహన ముఖ్యం.

చిన్న పిన్నీసు నుండి, పెద్ద కార్ల దాకా
ఇవాళ కావలసిన అత్యవసర సరుకుల నుండి, రేపు అరవై దాటాక బ్రతకడానికీ
అన్నిటికీ డబ్బు కావాలి.

మరి ఆ డబ్బు ని గురించి ఒక ప్రణాళిక ఉండటం చాలా ముఖ్యం. దానిని ఈ క్రింది విధంగా చేసుకోవచ్చు.

స్థితిగతుల బేరీజు:

అన్నిటికన్నా ముఖ్యమయినది మన ప్రస్తుత స్థితిగతులు ఏమిటి అన్నది తెలుసుకోవడం. అంటే మన ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయి ? మిగులులో ఉన్నామా, లోటులా ఉన్నామా అన్న అవగాహన కలిగి ఉండడం.
ఆదాయం: జీతం, ఇంటి మీద వచ్చే అద్దె, వ్యాపారంలో లాభాలు, స్టాక్స్ నుండి వచ్చే డివిడెండ్లు, ఎఫ్డీలు బాండ్ల నుండి వచ్చే వడ్డీ మొదలైనవి
వ్యయం: నెలవారీ ఖర్చులు, ఇంటికి కట్టే అద్దె, ఈఎమైలు, అప్పుల వడ్డీలు, మొదలైనవి

నెలకి ఉన్న ఖర్చులు సుమారుగా బేరీజు వేసుకుని మన ఆదాయం, వ్యయం కన్నా ఎక్కువుందా లేదా అని గమనించుకోండి.

ఆ తర్వాత మీకు దగ్గరలో, దూరంగా రానున్న ఖర్చుల వివరాలు వ్రాసుకోండి.

ఉదా:

  • వచ్చే ఆరు నెలల్లో ఏదయినా పెద్ద ఖర్చు ఉందా ? – ఫోను కొనుక్కోవడం, స్కూలు ఫీజు వంటివి
  • వచ్చే రెండు మూడు ఏళ్ళలో కొనుగోలు చేయదలచుకున్న పెద్ద వస్తువులు ఏమన్నా ఉన్నాయా ? – కారు, నగలు వగయిరా
  • వచ్చే పది ఏళ్ళలో పెట్టవలసిన పెద్ద ఖర్చులు ఉన్నాయా ? – పిల్లల పెళ్ళి ఖర్చు, చదువుల ఖర్చు వగయిరా
  • ఇంకా దూరంలో ఉన్న ఖర్చులు – పదవీ విరమణ తర్వాత ఉండే ఖర్చులు

చాలా మటుకు స్పష్టత మీకు ఇప్పటికే వస్తుంది.

ప్రణాళిక:

ఇక మన స్థితిగతుల గురించి తెలిసాక చేయాల్సిన రెండో పని ప్రణాళిక సృష్టించుకోవడం.
ప్రణాళిక అనేది సరళంగా కూడా ఉండవచ్చు.

మీకున్న వనరులతో మీరు వ్రాసుకున్న ఖర్చులలో ఎంత మాత్రం సాధించగలరు అన్నది అంచనా వేసుకోండి.

ఉదా: నెల నెలా ఐదు వేలు మిగులు ఉంది, వచ్చే ఆరు నెలల్లో కొనాలనుకున్న ఫోను ఖరీదు పదిహేను వేలు. ఇది సమకూరుతుందా లేదా ?
రెండు మూడేళ్ళలో కొనాల్సిన కారు ఐదు లక్షలు. దీనికి డబ్బు సరిపోతుందా లేదా ?

ఇలా. ఇది తయారు చేసుకునేటప్పుడు మీకు మీరు నిజాయితీగా ఉండండి.
ఈ చిట్టా మీకు తయారయితే మీకు అనుకున్న వాటిలో ఏమి సాధించగలం అన్న అవగాహన వస్తుంది.

ఇక దీని తరువాయి. కావలసిన డబ్బుని ఎలా దాచుకోవాలి. ఆర్డీగానా, ఎప్డీ గానా, స్టాక్స్ లోనా, మ్యూచువల్ ఫండ్లలోనా అన్నది. (ఇవి విపులంగా మళ్ళీ వేరే టపాలలో చూద్దాం.)
ఈ ప్రణాళిక సిద్ధమయిన తరువాత అన్నీ సమకూరితే సరి. కానీ లోటు ఉంటే మీకున్న దారులు

  • ఒకటి – ఉన్న వ్యయాలు తగ్గించుకోవడం
  • రెండు – ఆదాయం, రాబడి పెంచుకోవడం

సరిచూసుకోవడం:

ఇక చివరగా చెయ్యాల్సిన ముఖ్యమయిన పని మీరు వేసుకున్న ప్రణాళిక ప్రకారం అన్నీ జరుగుతున్నాయా అని సరిచూసుకోవడం.

ఇది మీరు ఒక నిర్దిష్ట నిడివిలో చేసుకోవచ్చు. ఉదా: ప్రతీ మూడు నెలలకీ ఒక సారి.

ఎలా అంటే ఏడాదికి సుమారుగా అరవై వేలు కావలసి వస్తే, ఆరు నెలలకి కనీసం ముప్ఫై వేల చేరువలో ఉన్నామా లేదా వగయిరా…
ఉంటే అదే పంథా కొనసాగించండి, లేకుంటే ఏ విధంగా సరి చేసుకోవాలో అని ఆలోచించండి.

ఇదంతా చదివిన తరువాత ఇవన్నీ తెలిసినవేగా అని ఆలోచన మీకు రావచ్చు. కానీ ఇలాంటి ఒక ప్రణాళిక అంటూ ఉండడం మన డబ్బు సంపాదించడంలో మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇక ముందు టపాలలో ఇలాంటి ఒక ప్రణాళిక వేసుకునేందుకు అనువుగా ఉన్న పనిముట్ల గురించి కూడా మాట్లాడుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *