

ఇంతకు ముందు వ్యాసంలో మనం ఈక్విటీ మన పోర్ట్ఫోలియో లో ఎందుకు అవసరమో చెప్పుకున్నాం. అది మ్యూచువల్ ఫండ్ల ద్వారా కూడా ఎలా సాధ్యమో చూసాం. అయితే మ్యూచువల్ ఫండ్లు కేవలం ఈక్విటీ కోసమే కాకుండా డెట్ మార్కెట్లలో మదుపు చేసేవి కూడా ఉంటాయి.
ఈ మ్యూచువల్ ఫండ్ల కథా కమామీషు ఏమిటి ? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు చర్చిద్దాం.
మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్థూలంగా రెండు రకాలు. డెట్, ఈక్విటీ. స్థూలంగా అని ఎందుకన్నానంటే మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఎంతో క్లిష్టతరమయినవి ఉన్నాయి. కానీ మనం ఈ రెండింటినీ ఈ టపా కోసం పరిగణిద్దాం.
డెట్: స్థిర ఆదాయం అందించే వనరులలో మదుపు చేసేవి.
ఈక్విటీ: షేర్ మార్కెట్లలో మదుపు చేసేవి. ఒక ఫండ్ ఈక్విటీగా గుర్తింపు చెందాలంటే అది కనీసం 65% ఈక్విటీలో మదుపు చెయ్యాలి. మిగతా మొత్తం వివిధ రకాలుగా క్యాష్, స్థిర ఆదాయ వనరులలో మదుపు చేసేందుకు వెసులుబాటు ఉంది.
మన అవసరాన్ని బట్టి స్థిర ఆదాయంలో లేదా ఈక్విటీకి చెందిన మ్యూచువల్ ఫండ్లలో మదుపు చెయ్యవచ్చు.
అయితే ఈక్విటీ లోనే వివిధ రకాలు, డెట్ లోనూ వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. ఈ వ్యాసంలో మనం ఈక్విటీ ఫండ్ల గురించి మాట్లాడుకుందాం.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల గురించి చెప్పుకునేముందు మనకి షేర్ మార్కెట్ల మీద కొంత అవగాహన ఉండాలి. అది చర్చిద్దాం.
షేర్ మార్కెట్ల ట్రేడింగ్ ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అనే ఎక్స్చేంజీల ద్వారా జరుగుతుంది. వాటిలో ఎన్నో కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. ఉదా: ఎన్ ఎస్ ఈ లో దాదాపు రెండువేల కంపెనీలు లిస్ట్ అయ్యాయి. ఆ కంపెనీల మార్కెట్ క్యాప్ ప్రకారం వాటిని లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్,మిడ్ క్యాప్ గా వర్గీకరిస్తారు.
లార్జ్ క్యాప్ – లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు మార్కెట్ క్యాప్ ఎక్కువగా ఉన్న కంపెనీలలో మాత్రమే మదుపు చేస్తాయి. నిఫ్టీ మొదటి వంద కంపెనీలలో . అంటే ఆ కంపెనీలు ఇప్పటికే మంచి స్థితిలో ఉండి స్థిరమైన ఆదాయం కలిగి ఉంటాయి. అంటే ఈ కంపెనీల ఒడి దుడుకులు మిగతా వాటికంటే తక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువ నష్టాలు కలగకుండా సాఫీగా ఉండే రిటర్న్స్ కావాలంటే వీటిలో మదుపు చెయ్యవచ్చు.
మిడ్ క్యాప్ – మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు బాగా ఎదుగుదల ఉండి ఇంకా మార్కెట్ క్యాప్ మరీ ఎక్కువ లేని కంపెనీలలో మదుపు చేస్తాయి. ఈ కంపెనీలలో కొన్ని దీర్ఘకాలంలో లార్జ్ క్యాప్ గా ఎదిగే అవకాశాలు ఉంటాయి. కానీ వీటిలో ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి. రాబడి లార్జ్ క్యాప్ కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంది. కానీ మార్కెట్ పడితే లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ.
స్మాల్ క్యాప్ – స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు చిన్న కంపెనీల షేర్లలో మదుపు చేస్తాయి. అంటే వీటి మార్కెట్ క్యాప్ తక్కువ. స్మాల్ క్యాప్ కంపెనీలలో చాలా మటుకు ఎదుగుదల సరిగా లేక మిడ్, లార్జ్ క్యాప్ సంస్థలుగా ఎదగకపోవచ్చు. కాబట్టి వీటిలో ఎంపిక చేయాలంటే చాలా నైపుణ్యం కలిగి ఉండాలి.
పెట్టుబడి పెట్టే వారి వయసుని బట్టి, వారి రిస్క్ ప్రొఫైల్ ని బట్టి సరయిన ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో అన్నీ ఒకే రకం కాకుండా ముందుగా అనుకున్న కేటాయింపు శాతంలో మదుపు చెయ్యవచ్చు. అంటే వయసు తక్కువ ఉండి ఒడి దుడుకులు తట్టుకోగలిగితే ఉదా: అరవై శాతం లార్జ్ క్యాప్, నలభై శాతం మిడ్ క్యాప్ లో పెట్టుబడి పెట్టవచ్చు. వయసు ఎక్కువ ఉండి సాఫీగా ఉండాలంటే ఉదా:ఎనభై శాతం లార్జ్ క్యాప్,ఇరవై శాతం మిడ్ క్యాప్ లో పెట్టుబడి పెట్టవచ్చు.
కాబట్టి కేటాయింపు చాలా ముఖ్యం.
ఇవి కాక మల్టీ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు కూడా ఉంటాయి. వీటికి అన్ని రకాల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉంటుంది. మంచి ఫండ్ మేనేజర్ ఉన్న ఫ్లెక్సీ లేదా మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఎంచుకుంటే వారు సరయిన కేటాయింపు చేసి మదుపు చేస్తారు.
ఈ సమాచారాన్ని ఉపయోగించి మీకు అనువయిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి.