
మన ధన సముర్పాజన ప్రయాణంలో కొన్ని విషయాలు మనకు కనీసంగా తెలిసుండాలి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం.
పెట్టుబడి: డబ్బు దాచుకోవడానికీ, పెట్టుబడి పెట్టడానికీ చాలా తేడా ఉంది. డబ్బు దాచుకోవడం అంటే మనం ఆర్జించే మొత్తంలో కొంత పక్కకు తీసి పెట్టుకోవడం. పెట్టుబడి పెట్టడం అంటే మనం దాచుకున్న డబ్బుని వృద్ధి చెందే సాధనాలలో దాచడం.
ఉదా: మీకు వచ్చిన ఆదాయంలోమీకు ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఉన్నాయి. వాటిని మీ ఇంటి గల్లా పెట్టెలో ఉంచారనుకోండి. ఒక ఏడాది తరువాత అవి అంతవుతాయి ? ఇంకా వెయ్యి రూపాయలుగానే మిగులుతాయి.
దాని బదులు మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంచారనుకోండి. అవి ఎంతవుతాయి ? కనీసంగా ఒక ఐదు శాతం. అంటే ఒక యాభై రూపాయలు మీకు అదనంగా చేరాయి.
కాబట్టి పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. అదీ సరయిన సాధనాలలో.
ఇక మనం పెట్టుబడి ఎందుకు పెట్టాలన్న రెండో విషయానికి వద్దాం.
ద్రవ్యోల్బణం: మీరు కొనుగోలు చేసే కూరలు, పప్పు దినుసులు, పళ్ళు ఇవన్నీ ఒక ఏడాది క్రితంతో పోలిస్తే ధర ఎంత పెరిగాయి ?
ఇవి సుమారున ఒక ఆరు ఏడు శాతం పెరుగుతాయి. కొన్నిటి విషయాల్లో ఇంకా ఎక్కువగా కూడా. ఉదా: మీ వంట నూనె, పెట్రోలు.
మరి మీ దగ్గర ఉన్న డబ్బు ఒక వెయ్యి రూపాయలు ఒక సంవత్సరం నుంచీ అలాగే ఉన్నాయనుకోండి. వాటి విలువ ఇప్పుడు ఎంత ? మీ వెయ్యి రూపాయలు మీకేమీ నష్టం రాకుండానే తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయల సరుకే కొనగలుగుతాయి. ఎందుకు ? మీ నిత్యావసరాల ఖరీదు పెరిగినందువల్ల. అంటే మీ ధనం తగ్గిందన్నమాట.
మరి ఇది ఆలోచించండి. గత కొన్ని సంవత్సరాల ద్రవ్యోల్బణం సగటు తీసుకుంటే కనీసం ఆరు నుండి ఏడు శాతం ఉంది. అంటే మీ పెట్టుబడుల సగటు రాబడి ఆపై ఉంటే తప్ప మీ డబ్బు తగ్గుతుందన్నమాట.
సరిగా అర్థమయ్యేలా చెప్పాలంటే మీకు ఇవాళ నెలనెలా ఇంటి ఖర్చుకి పది వేలు అవసరముంటే, ఇరవై సంవత్సరాలలో ఆరు శాతం ద్రవ్యోల్బణంతో ముప్ఫై రెండు వేలు అవసర పడతాయి. కాబట్టి మీ డబ్బు కనీస మొత్తం అంత ఉంటే నెలకి తగ్గ ఖర్చులు సర్దుబాటవుతాయి.

ఇది మనం చెప్పుకోబోయే తరువాతి అంశానికి దారి తీస్తుంది. అదే చక్రవడ్డీ.
చక్రవడ్డీ: మొత్తం ఆర్థిక శాస్త్రంలో మనం సరిగా అర్థం చేసుకోవలసింది ఏదన్నా ఉందంటే అది చక్రవడ్డీ.
మీరు ఈ కథ వినే ఉంటారు. ఒక రాజు చదరంగంలో గెలిచిన వ్యక్తికి ఏం కావాలంటే చదరంగంలో ప్రతీ చదరానికీ ఒకటితో మొదలు పెట్టి, రెట్టింపు చేస్తూ మొత్తం అరవై నాలుగు చదరాలకీ ఎంత వస్తుందో అంత ధాన్యం ఇమ్మన్నాడట. ఓస్ ఇంతేనా అనుకున్న రాజు చివరి లెక్క చూస్తే భూమి మొత్తం మీద ఉన్న ధాన్యం కూడా సరిపోవు అని లెక్క తేలుతుంది.
పై కథలో మీకు అర్థమావాల్సింది, చిన్న మొత్తాలు కూడా సరయిన పెట్టుబడి పెడితే దీర్ఘ కాలంలో ఎంతో పెద్ద మొత్తం అవుతుంది. అందుకని మీరు జీవితంలో ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పెట్టుబడులు పెట్టడం నేర్చుకోవాలి.
ఉదా: మీరు నెల నెలా ఎస్ ఐ పీ లో ఒక ఐదు వేలు పెట్టుబడి పెట్టి, ఒక పది శాతం వృద్ధి ఆశిస్తే అది ఇరవై ఏళ్ళలో ముప్ఫై లక్షలకి చేరువవుతుంది.

మరి ఇది ఇంత చిన్న మొత్తం కదా, మనందరమూ ఈ పాటికి కోటీశ్వరులయిపోయి ఉండాలి అని మీకనిపిస్తే తప్పు లేదు. మనం ఎందుకు కాము అంటే అలా క్రమశిక్షణతో మనం పెట్టుబడి పెట్టకపోవడం. పెడితే అద్భుతాలు జరుగుతాయి.
మీ పెట్టుబడి ప్రయాణంలో పైవి గుర్తుపెట్టుకోండి.
Pingback: స్థిర ఆదాయం, ఈక్విటీ … – డబ్బు