క్రెడిట్ కార్డులు – వాడాలా వద్దా ?

మనలో చాలా మందికి ఈ సందేహం ఉంటుంది.

అప్పు అన్నది చెడ్డదయితే మరి క్రెడిట్ కార్డు వాడటం కూడా చెడ్డదే కదా. ఎందుకంటే అది ఒక అప్పు లాంటిది. మరి క్రెడిట్ కార్డు ఉపయోగించాలా వద్దా అన్నదాని మీద చర్చించుకుందాం.

ముందుగా ఓ చిన్న విషయం. ఏదయినా ఒక సేవని వినియోగించుకునేప్పుడు మంచీ, చెడూ రెండూ ఉంటాయి. పరిస్థితిని బట్టీ, మన మనస్థత్వాన్ని బట్టీ అది మనకి మంచి లేదా చెడు అవుతుంది. అలాగే క్రెడిట్ కార్డు విషయంలో కూడాను. క్రెడిట్ కార్డు సరయిన పద్ధతిలో వాడటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అలాగే దుర్వినియోగం చేస్తే అంతకు మించి చెడు జరిగే అవకాశం కూడా ఉంది.

కాబట్టి క్రెడిట్ కార్డు అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, దాని ఉపయోగాలు ఏమిటి, దాని వల్ల నష్టాలు ఏమిటి తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు – మన అవసరానికి వీలుగా, నగదు అవసరం లేకుండా ఖర్చు పెట్టుకునే వీలున్న ఒక కార్డు. ఆ కార్డు పై నెల నెలా ఎంత మొత్తం వాడుకోగలమో జారీ చేసే సంస్థ ముందస్తుగానే నిర్ణయించబడుతుంది.

క్రెడిట్ కార్డు ఎలా పని చేస్తుంది ?

ముందస్తుగా క్రెడిట్ కార్డులు ఎవరు ఇస్తారు అన్నది చెప్పుకుందాం. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ క్రెడిట్ కార్డులని ఇవ్వగలుగుతాయి. క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరగడానికి పేమెంట్ ప్రాసెసర్స్ ఉంటాయి. ముఖ్యంగా రెండు వీసా, మాస్టర్కార్డు. ఇవి కాక అమెక్స్, రూపే, డైనర్స్ లాంటివి కూడా ఉన్నా చాలా మటుకు క్రెడిట్ కార్డులు వీసా, మాస్టర్కార్డు కి అనుసంధానితమై ఉంటాయి.

క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థ ఈ పేమెంట్ ప్రాససర్లతో ఒప్పందం కుదుర్చుకుని మీకు క్రెడిట్ కార్డు ఇస్తుంది. ఈ కార్డు జారీ చేసినందుకు గానూ కొన్ని సంస్థలకి మీరు వార్షిక రుసుము చెల్లించవలసి వస్తుంది, కొన్ని ఉచితంగా ఇస్తాయి.

మీ క్రెడిట్ స్కోరు, స్థూల ఆదాయాన్ని బట్టి మీరు క్రెడిట్ కార్డు ద్వారా ఎంత వరకూ ఖర్చు పెట్టవచ్చు అనేది నిర్ణయింపబడుతుంది. మీరు మీకు లభ్యమైన పరిమితుల బట్టి క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు పెట్టవచ్చు.

క్రెడిట్ కార్డు ఇంతకు ముందులా కాక చిన్న దుకాణాల నుండి పెద్ద షోరూంల దాకా అన్నిటిలోనూ అంగీకరిస్తున్నారు. దుకాణాలు POS టర్మినల్ ద్వారా మీ క్రెడిట్ కార్డు లావాదేవీలని చేస్తాయి. ఇవే కాక మీరు ఆన్లైను చేసే లావాదేవీలకి (అంటే షాపింగు, కిరాణా కొనుగోళ్ళు వగయిరా) కూడా క్రెడిట్ కార్డులు వాడవచ్చు.

మీరు పెట్టిన ఖర్చులను బట్టి నెల నెలా మీరు కట్టవలసిన రుసుము నివేదిక పంపుతారు. ఆ నివేదిక ప్రకారం మీరు మొత్తం చెల్లింపులు చేస్తే మీరు ఇంకే అదనపు రుసుమూ కట్టక్కర్లేదు. కానీ గడువు లోపల ఆ రుసుము చెల్లించలేకపోతే దానికి వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

స్థూలంగా క్రెడిట్ కార్డు పని చేసే విధానం ఇది.

క్రెడిట్ కార్డు వల్ల జారీ సంస్థలకి ఏం లాభం ?

మీకు క్రెడిట్ కార్డు జారీ చేసినందుకు ఆ సంస్థ మీ దగ్గర వార్షిక రుసుము వసూలు చెయ్యవచ్చు.

అదీ గాక మీరు సమయానికి గనుక చెల్లింపులు చేయకపోతే వడ్డీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత ఎక్కువ అంటే నెలకు మూడు – నాలుగు శాతం మధ్య. అంటే ఏడాదికి సుమారుగా ముప్ఫై – నలభై శాతం మధ్య.

ఒక వేళ మీరు ఇతర దేశాల కరెన్సీలో లావాదేవీలు చేస్తే అదనపు రుసుములు విధిస్తాయి.

ఇవన్నీ ఆ సంస్థలకి ఆదాయం.

క్రెడిట్ కార్డు వల్ల వినియోగదారుడికి ఏం లాభం ?

క్రెడిట్ కార్డు ద్వారా లభించే ముఖ్యమయిన ఉపయోగం మీరు నగదు మీతో పాటూ తీసుకు వెళ్ళాల్సిన అవసరం చాలా తక్కువ. అది కాక ఇంకా ఉపయోగాలు:

  • క్రెడిట్ కార్డు మీద పెట్టిన ఖర్చు వినియోగదారుడికి వడ్డీ లేని అప్పు లాంటిది. యాభై రోజుల వరకూ ఏ వడ్డీ చెల్లించనవసరం లేకుండా డబ్బు ఉపయోగించుకునే చక్కని సాధనం.
  • మీరు పెట్టిన ఖర్చులకు సంబంధించి గనుకు మీకు ఆ వస్తువు కానీ సేవ కానీ లభించకపోయిన నేపథ్యంలో మీరు చార్జ్బ్యాకు ద్వారా ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇది అత్యంత ముఖ్యమయిన ఉపయోగం.
  • క్రెడిట్ కార్డు ద్వారా పెట్టిన ఖర్చులకి మీకు రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఆ రివార్డు పాయింట్లు మీకు రెండు మూడు శాతం నుంచి, కొన్ని కార్డులకి ఇరవై ముప్ఫై శాతం వరకూ రాబడినిస్తుంది.
  • అత్యవసర పరిస్థితుల్లో ఖర్చులకి పనికొస్తుంది. మరీ అత్యవసరం అయితే ఏటీయం ద్వారా డబ్బు కూడా తీసుకోవచ్చు.
  • పండుగలకీ, తరచుగానూ వివిధ ఆన్లైను వెబ్సైట్లు మీకు మీ క్రెడిట్ కార్డు వాడితే తగ్గింపు ధరలకి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఇస్తాయి.

క్రెడిట్ కార్డు ఏ సంస్థ నుండి తీసుకుంటే మంచిది ?

దాదాపు అన్ని పెద్ద బ్యాంకులూ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని అందిస్తాయి. అయితే వీటిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ, అమెక్స్, ఆక్సిస్ వంటి వాటికి మంచి ఆఫర్లు ఉంటాయి. వాటి నుండి తీసుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డులు ఎన్నో రకాలు కాబట్టి మీ అవసరాన్ని బట్టి ఎలాంటి కార్డు, ఎవరి దగ్గర నుండి తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. వీటిని గురించి మరో టపాలో వివరిస్తాను.

క్రెడిట్ కార్డు మీకు మంచిదా లేదా అన్నది మీరు ఉపయోగించే విధానం పై ఆధారపడి ఉంటుంది. నా ప్రకారం సరయిన పద్ధతిలో క్రమశిక్షణతో వాడుకుంటే క్రెడిట్ కార్డుల వల్ల ఎంతో ఉపయోగం. కాబట్టి సరయిన ఎంపిక చేసుకుని, దుర్వినియోగం కాకుండా క్రెడిట్ కార్డులని వాడండి.

One thought on “క్రెడిట్ కార్డులు – వాడాలా వద్దా ?

  1. Pingback: క్రెడిట్ కార్డులు – రివార్డు పాయింట్లు – డబ్బు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *