స్థిర ఆదాయం, ఈక్విటీ …

స్థిర ఆదాయం, ఈక్విటీ, రియల్ ఎస్టేట్, బంగారం పెట్టుబడులకు సంబంధించి మనం తరచూ వినే మార్గాలు. అసలు అవంటే ఏమిటి ? మన పెట్టుబడులకూ వాటికీ సంబంధం ఏమిటి అని చర్చించుకుందాం.

మీరు ఇప్పటికే చదివి ఉండకపోతే ఈ టపా చదివి రండి. మనం చెప్పుకునే వాటికి నేపథ్యంగా పనికొస్తుంది.

ఇంతకు ముందు టపాలో మనం ద్రవ్యోల్బణం గురించి చెప్పుకున్నాం. మన పెట్టుబడులు దానిని అధిగమించి ఎందుకు ఉండాలో కూడా చర్చించుకున్నాం.

మరి మనం ఆ పెట్టుబడులు పెట్టడానికి అనువైన సాధనాలు ఏమిటి, అవి ఎలా ఉపయోగించుకోవాలి అనే నేపథ్యంలో స్థిర ఆదాయం, ఈక్విటీ గురించి చెప్పుకుందాం. బంగారం, రియల్ ఎస్టేట్ గురించి మరోసారి మాట్లాడుకుందాం.

స్థిర ఆదాయ వనరులు: అంటే మనకి స్థిరంగా డబ్బు/వడ్డీ వచ్చే సాధనాలు. ఉదా: ఫిక్స్డ్ డిపాజిట్లు, వివిధ కంపెనీలు, రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన బాండ్లు, ఆర్బీఐ బాండ్లు, టీ బిల్స్, గవర్న్మెంట్ సెక్యూరిటీస్ వగయిరా.

ఈ సాధనాలు వివిధ సంస్థలు (ప్రభుత్వం కూడా) తమ పెరుగుదలకి లేదా అవసరాలకూ సంబంధించిన డబ్బుల కోసం ఉపయోగిస్తాయి. అంటే ఒక రకంగా మీరు ఈ సంస్థలకి ఋణం ఇస్తున్నారన్నమాట. మీరు ఋణం ఇచ్చినందుకు మీకు అవి వడ్డీ చెల్లిస్తాయి.

మరికొన్ని ప్రభుత్వం ప్రజలలో పొదుపు చేసే గుణాన్ని పెంపొందించడానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలు మొదలయినవి ఉదా: పీపీఎఫ్, పోస్ట్ ఆఫీసు స్కీములు. వీటికి పన్ను మినహాయింపులు కూడా వర్తిస్తాయి.

చాలా మటుకు స్థిర ఆదాయ వనరులు మనకి ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా ఆదాయం వచ్చేందుకు ఉపయోగపడతాయి.

మనకి అత్యవసరమయిన డబ్బునీ, చేతికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంది వచ్చేలా కావలసిన డబ్బునీ స్థిర ఆదాయ వనరులలో పెట్టుబడి పెట్టుకోవాలి. పన్ను మినహాయింపులకీ వాడుకోవచ్చు.

వీటిలో ఏవి ఉపయోగిస్తే మంచిది అనేది మన పరిస్థితి, స్థితిగతులను అనుసరించి ఉంటుంది.

పీపీఎఫ్ – ప్రభుత్వ భరోసా ఇస్తుంది, దీనికి చెల్లించే వడ్డీ బాగుంటుంది. 80C కింద దీంట్లో పొదుపు చేసిన మూలం మీకు పన్ను తగ్గడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది అన్నిటి కంటే భేషైన మార్గం.

వీటిలో పెట్టుబడి పెట్టడం సులువు. చాలా బ్యాంకులలో ఖాతా తెరిచి ఏడాదికి లక్షా యాభై వేల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. కానీ ఇందులో సమస్య మనం అక్కరకు కావలసినప్పుడు అప్పటికప్పుడు ఇందులో నుండి డబ్బు తీసుకోవడానికి వీలుండదు. కాబట్టి ఇది మీ పదవీ విరమణ తరువాత ఉపయోగపడే మంచి సాధనం.

ఎప్డీ – ఒకవేళ మీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు అందుబాటులో ఉంటూ, ఫరవాలేదనిపించే వడ్డీ, బ్యాంకు భద్రత కోరుకుంటే ఎఫ్డీలు మంచి ఎంపిక. ఒకవేళ అత్యవసరమయితే వీటిని త్వరగా మన చేతికి తెచ్చుకోవచ్చు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్లైను ఎఫ్డీ సృష్టించుకోవచ్చు.

బాండ్లు – బాండ్లలో పెట్టుబడి పెట్టడం పీపీఎఫ్, ఎఫ్డీలతో పోలిస్తే కొద్దిగా క్లిష్టం. వీటిలో కొన్నిటికి డీ మ్యాట్ ఖాతా అవసరపడుతుంది.

ఎఫ్డీలతో పోలిస్తే వీటిలో వడ్డీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే వీటిలో నష్టం కలిగే ఆస్కారం ఎక్కువే. కాబట్టి కొంత మేర అవగాహన పెంచుకున్నాకే వీటిలో పెట్టుబడులు పెట్టడం మంచిది.

ఈక్విటీ: ఈక్విటీ, ఈక్విటీకి సంబంధించిన పెట్టుబడులు మనకి ఇంకో రకమయిన సాధనాలు. ఉదా: షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు, వగయిరా.

అసలు ఈక్విటీ అంటే ఏమిటో క్లుప్తంగా చెప్పుకుందాం. మీకు ఒక వ్యాపారం ఉంది, దానిని విస్తరించడానికి మీకు డబ్బు కావాలి. అది చెయ్యడానికి రెండు మార్గాలు. పైన చెప్పుకున్నట్టు కంపెనీ బాండ్లు విడుదల చెయ్యడం, లేదా కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చి వాటి లాభాల్లోనూ, నష్టాల్లోను ఇతరులను చేర్చుకునేలా ఈక్విటీ ఇవ్వడం.

ఈ సాధనాలు ముఖ్యంగా షేర్ మార్కెట్టుకు సంబంధించినవి ఉంటాయి. ఇంకా ఇతర మార్గాలు ఉన్నా ప్రముఖంగా షేర్లకు సంబంధించినవి. ఉదా: ఎన్ ఎస్ ఈ, బీ ఎస్ ఈ లో కొనీ, అమ్మగలిగే షేర్లు, షేర్లని ఆధారంగా మదుపు చేసే మ్యూచువల్ ఫండ్లూ లాంటివి.

మనకు కావలసిన చాలా మటుకు పెట్టుబడులు పై రెండిటి ద్వారా సాధ్యమవుతాయి.

స్థిర ఆదాయ వనరులలో నష్టం కలిగే అవకాశాలు ఈక్విటీతో పోలిస్తే తక్కువ. మరి ఈక్విటీలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి ?

ఎందుకంటే ఇంతకు ముందు టపాలో చెప్పుకున్నట్టు ద్రవ్యోల్బణం. స్థిర ఆదాయ వనరులు ద్రవ్యోల్బణంతో ఎక్కువగా ముడి పడి ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి మనకి ఈక్విటీలో కూడా ఎంతో కొంత శాతం పెట్టుబడులు ఉండాలి. ఆ శాతం ఎంత అనేది మనం ఒడిదుడుకులకి ఎంతగా తట్టుకోగలమనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

మన పెట్టుబడులకు ఎంత శాతం రాబడి అవసరం అనే బేరీజు వేసుకుని స్థిర ఆదాయాలలో, ఈక్విటీ సంబంధితాలలో అనువైన విధంగా పెట్టుబడులు పెట్టుకోవాలి. ఆ ఆస్తి కేటాయింపు సరయిన నిష్పత్తిలో ఉండడం చాలా ముఖ్యం.

ఇక ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి అనువైన మార్గాలేవో చూద్దాం.

షేర్లు – షేర్లలో ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టడం ఎంతో అవగాహన ఉంటే తప్ప చెయ్యవద్దని నా సలహా. ఎందుకంటే దానికి వెచ్చించాల్సిన సమయం, చేయాల్సిన పరిశోధన చాలా ఎక్కువ. దీని గురించి మరో టపాలో వివరిస్తాను.

షేర్లలో మదుపు చెయ్యడానికి మీకు ఒక డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా ఉండాలి. అవి జెరోధా, అప్స్టాక్స్, ఏంజెల్ బ్రోకింగ్, గ్రో వంటి వాటిలో సృష్టించుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్లు – మ్యూచువల్ ఫండ్లు ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి అనువైన మార్గం. దీనిని అర్థం చేసుకోవడం సులువు. షేర్ మార్కెట్టులో పెట్టుబడి పెట్టడం మీ కారు మీరు నడిపేట్టయితే, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి మీరు ఒక డ్రైవర్ ని పెట్టుకోవడం వంటిది. డ్రైవర్ ఎలా అయితే చాక చక్యంగా మీ కారు నడపగలడో, ఒక ఫండ్ మేనేజర్ మీ డబ్బుని సరయిన విధానంలో వేరు వేరు ఈక్విటీలలో పెట్టుబడి పెడతాడు.

వీటిలో టోకున లేదా ఎసైపీ విధానంలో మదుపు చేయవచ్చు.

వీటిలో మదుపు చెయ్యడానికి వివిధ ఏఎమ్సీల వెబ్సైటు ద్వారా కానీ కువేరా, గ్రో వంటి వాటిలో ఖాతా సృష్టించి చెయ్యవచ్చు.

పై వన్నీ వివరంగా ఇంకో టపాలో మాట్లాడుకుందాం.

One thought on “స్థిర ఆదాయం, ఈక్విటీ …

  1. Pingback: మ్యూచువల్ ఫండ్లు – ఈక్విటీ – డబ్బు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *