
భీమా అంటే ఏమిటి ? – మీకు ఏదయినా అనుకోని నష్టం కలుగుతుంది అనుకుంటే దాని నుండి మీరు కాపాడుకోగలిగే ఒక సాధనం భీమా. అంటే భవిష్యత్తులో జరగగలిగే నష్టాన్ని గుర్తించగలిగి ఆ ప్రమాదాన్ని గురించి మీరు ప్రణాళిక ప్రకారం ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవడం.
భీమా అనేది ఇద్దరి మధ్యన ఒప్పందం. ఇందులో ఒకరు భీమా తీసుకున్న మీరయితే ఇంకొకరు ఆ భీమా జారీ చేసే సంస్థ. మీరు ఆ సంస్థ నుండి మీకు జరగగలిగే ప్రమాదం నుండి రక్షణకి ఒక భీమా పథకం తీసుకుంటారు. అంటే ఒకవేళ ఆ ప్రమాదం జరిగితే ఆ సంస్థ మీరు ఎంపిక చేసుకున్న మొత్తాన్ని మీకు కానీ, మీరు చెప్పిన వారికి కానీ ఇస్తుంది. అలా ఇవ్వడానికి మీరు ఆ సంస్థకి ముందే ఒప్పందం కుదుర్చుకున్న ప్రీమియంని అనుకున్న కాలానికి చెల్లించాలి.
భీమా రకాలు – భీమా ఎన్నో రకాలు. జీవిత భీమా, ఆరోగ్య భీమా, వాహన భీమా, ఇంటి భీమా మొ. వీటిలో కొన్ని తప్పనిసరి అయితే కొన్ని తీసుకోవడం ఉపయోగకరం. వీటిని గురించి తెలుసుకుందాం. ఈ వ్యాసంలో ముఖ్యంగా రెండు రకాల భీమాల గురించి:
జీవిత భీమా – భవిష్యత్తులో మీకు ఏదయినా అనుకోని విపత్తు జరిగితే మీ కుటుంబానికి రక్షణగా ఈ భీమా ఉపయోగపడుతుంది. ఉదా: మీ కుటుంబంలో మీరొక్కరే సంపాదనా పరులు. మీ సంపాదన మీదే కుటుంబం సాగుతుంది. మరి ఒకవేళ మీరు లేరనుకోండి, మీ కుటుంబం ఎలా కొనసాగుతుంది ? ఆ ఆటంకం మీ కుటుంబానికి రాకుండా మీరు జీవిత భీమా తీసుకోవచ్చు. ఒక వేళ మీకు ప్రాణ హాని జరిగి మీరు లేకపోతే మీరు ఒప్పందం కుదుర్చుకున్న మొత్తం మీ కుటుంబ సభ్యులకి చెందుతుంది. మీ కుటుంబం కొనసాగడానికి సమస్య ఉండదు. మీ వార్షిక జీతానికి కనీసం పది రెట్లు ఉండేట్లుగా ఇది తీసుకోమని సూచిస్తారు. మీరు తీసుకున్న మొత్తాన్ని బట్టి, మీ వయసుని బట్టి, మీకున్న ఇతర ఆరోగ్య ఇబ్బందులని బట్టీ ప్రీమియం ఎంత అనేది నిశ్చయింపబడుతుంది.
ఆరోగ్య భీమా – మీరు గమనించే ఉంటారు. ఆసుపత్రుల ఖర్చులు గత కొద్ది ఏళ్ళుగా ఎంత పెరిగాయో. ఒక ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చినా, ఇతర ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మనం ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఈ రోజుల్లో చాలా ఎక్కువ. కానీ కొద్దిపాటి ప్రణాఌకతో ఇది నివారించచ్చు. ఒక ఆరోగ్య భీమా తీసుకోవడంతో.
మీ వయసు, ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు ఒక సంస్థని ఎంచుకుని వారి దగ్గర పాలసీ తీసుకోవచ్చు. మీకు గనక ఏదయినా ఆరోగ్య సమస్య తలెత్తి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే మీ భీమా సంస్థ మీ ఖర్చులని భరిస్తుంది.
ఇందులో చూసుకోవాల్సినవి చాలా ఉంటాయి. మీకు గనక ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని మీ భీమా సంస్థ ఆమోదిస్తుందా, మీరు తీసుకునే ఆసుపత్రి గది ఖర్చు ఎంత వరకూ ఆమోదిస్తుంది మొదలయినవి.
ఏ సంస్థ తక్కువ భీమా ప్రీమియం తీసుకుంటుంది, నమ్మకంగా మీ ఖర్చులని ఆమోదిస్తుంది అనేది మీరు చూసుకోవాల్సినవి.
పై రెండూ అత్యంత అవసరం కానీ ఇవి తప్పనిసరి కాదు. కానీ ఇప్పటికే మీకు వీటి అవసరం అర్థమయి ఉంటుంది. ఒక భీమా పాలసీ తీసుకునే ముందు ఇవి పరిగణించండి
ఎంత: మీకు అవసరమయిన భీమా మొత్తం ఎంత, దానికి పాలసీ రుసుము ఎంత ? మిగతా సంస్థలతో పోలిస్తే ఎలా తూగుతుంది ? ఇది సులభంగా సరి చూసుకోవడానికి ఇప్పుడు ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి. ఉదా: పాలసీ బజార్ వంటివి. వీటిని ఉపయోగించి సరి చూసుకోవచ్చు.
గత చెల్లింపులు: గతంలో ఈ సంస్థ భీమా చెల్లింపులు ఎలా చేసింది ? నూరు కి ఎన్ని సందర్భాలలో చెల్లింపులు చేసింది, ఎన్నిటికి లేదు. అవి సరయిన కారణాల వల్ల చెయ్యలేదా లాంటి అంశాలు పరిగణించాలి.
సంస్థ: భీమా సంస్థ ఎంత పెద్దది, అది దీర్ఘ కాలం మనగలుగుతుందా, వ్యాపారం చెయ్యగలుగుతుందా.
సేవ: సంస్థ అందించే సేవ ఎలాంటిది. చుట్టూ తిప్పుకునే రకమా, సులువుగా అందుబాటులో ఉంటుందా.
ఫిర్యాదులు: సంస్థ పై ఎలాంటి ఫిర్యాదులున్నాయి.
కాబట్టి పాలసీ ప్రీమియం మాత్రమే కాక పైవన్నీ కలిపి చూసుకుని బేరీజు వేసుకోవాలి.
భారత దేశంలో ఎన్నో సంస్థలు ఇప్పుడు భీమాని అందిస్తున్నాయి. అన్ని పెద్ద బ్యాంకింగ్ ఆధారిత సంస్థలు (హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, వగయిరా), ఎమెన్సీలు, ఎల్ ఐ సీ వంటి ప్రభుత్వ సంస్థలు ఇవి అందిస్తాయి. వీటిలో చాలా వరకూ నమ్మకమయినవైనా అన్ని రకాలుగా బేరీజు వేసుకుని మీకు కావలసిన పాలసీ తీసుకోవచ్చు.